Telangana: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి: భట్టి

  • సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు
  • సమ్మె చేయడం కార్మికుల చట్టబద్ధ హక్కు
  • ప్రభుత్వం తీరు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భట్టి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. సమ్మె కార్మికుల చట్టపరమైన హక్కు అని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. లేకపోతే ఈ పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు.

 విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే.. వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఎంయూనే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితిపై గవర్నర్, రాష్ట్రపతిని సలహా అడిగే పరిస్థితి వస్తుందని చెప్పారు.

More Telugu News