Chandrababu: పోయింది ఒక పులే... నో ప్రాబ్లం!: చంద్రబాబు

  • అసెంబ్లీలో 23 పులులు ఉండేవన్న చంద్రబాబు
  • తనపై రాబందుల్లా మీదపడ్డారని వ్యాఖ్యలు
  • ధర్మాడి సత్యానికి ఉన్నంత పట్టుదల కూడా జగన్ లో లేదని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా విభాగం విస్తృతస్థాయి సమావేశంలో ఆవేశంగా ప్రసంగించారు. వల్లభనేని వంశీ నిష్క్రమణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో టీడీపీ తరఫున 23 మంది పులులు ఉంటే, ఒక పులి వెళ్లిపోయిందని, అయినా ఫర్వాలేదని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి వెళితే రాబందుల్లా మీదపడ్డారని మండిపడ్డారు.

అంతేకాకుండా, చింతమనేని ప్రభాకర్ వ్యవహారంపైనా చంద్రబాబు స్పందించారు. ఏంచేశాడని చింతమనేనిని జైలుకు పంపారని ప్రశ్నించారు. దోపిడీ చేశాడా, లేక బాబాయ్ ని చంపాడా? అంటూ నిలదీశారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసిన ధర్మాడి సత్యానికి ఉన్నంత పట్టుదల కూడా సీఎం జగన్ లో లేదని ఎద్దేవా చేశారు. తాను జైలుకు వెళ్లొచ్చాడు కాబట్టి రాష్ట్రంలో అందరినీ జైలుకు పంపాలని ప్రయత్నిస్తున్నాడంటూ జగన్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ నాటకాలు మరెక్కడైనా సాగుతాయేమో కానీ తన వద్ద కాదని చంద్రబాబు అన్నారు. ప్రజావేదికను కూల్చి ఏం సాధించగలిగారని ప్రశ్నించారు.
Chandrababu
Telugudesam
West Godavari District
Vallabhaneni Vamsi
Chinthamaneni Prabhakar

More Telugu News