Kala Venkatrao: నియోజకవర్గాల వారీగా ఇసుక మాఫియాను తయారుచేసినట్టుంది: కొత్త ఇసుక పాలసీపై కళా వెంకట్రావు వ్యాఖ్యలు

  • నూతన ఇసుక విధానం ప్రకటించిన వైసీపీ సర్కారు
  • అవినీతికి తలుపులు తెరిచారంటూ కళా వెంకట్రావు విమర్శలు
  • ఉచిత ఇసుక విధానంతోనే కొరత తీరుతుందని స్పష్టీకరణ

ఏపీ ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అగ్రనేత కళా వెంకట్రావు విమర్శలు చేశారు. ప్రభుత్వ నూతన ఇసుక పాలసీ చూస్తుంటే నియోజకవర్గాల వారీగా ఇసుక మాఫియాను తయారుచేసినట్టుందని అన్నారు. నియోజకవర్గానికి ఒక రీచ్ ఏర్పాటు చేసి అవినీతికి తలుపులు తెరిచారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి సహకరించేలా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక అంశంపై 5 నెలల తర్వాత తీరిగ్గా కళ్లు తెరిచిందంటూ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.

రాజాంలోని తునివాడ రీచ్ లో టన్ను ఇసుక ధర రూ.550గా పేర్కొన్నారని, గతంలో అక్కడ 4 టన్నుల ఇసుక రూ.1400కే లభ్యమయ్యేదని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరాలంటే ఉచిత ఇసుక విధానం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇసుక ధర సామాన్యులు కొనేలా ఉండాలని కళా వెంకట్రావు హితవు పలికారు. నది పక్కనే ఉన్న శ్రీశైలంలో ట్రాక్టర్ ఇసుక రూ.9 వేలా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News