Bill Gates: అమెరికా రక్షణ శాఖ పుణ్యమాని ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా బిల్ గేట్స్

  • మైక్రోసాఫ్ట్ కు అమెరికా రక్షణ శాఖ కాంట్రాక్టు
  • రూ.70 వేల కోట్ల వర్క్ ఆర్డర్
  • పెరిగిన మైక్రోసాఫ్ట్ షేరు విలువ

ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక, వాణిజ్య సమాచార సంస్థ బ్లూమ్ బెర్గ్ నుంచి తాజాగా ప్రపంచ కుబేరుల జాబితా వెల్లడైంది. ఈసారి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన పాత స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుని నెంబర్ వన్ స్థానంలో పాగా వేశారు. గేట్స్ ఆస్తి 110 బిలియన్ డాలర్లు అని బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. 109 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఉన్నారు. కొన్నాళ్లుగా అగ్రస్థానం కోల్పోయిన బిల్ గేట్స్ మళ్లీ అగ్రపీఠం అధిష్ఠించడానికి కారణం అమెరికా రక్షణ శాఖ ఇచ్చిన ఓ కాంట్రాక్టు.

క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు సంబంధించిన ఆ వర్క్ ఆర్డర్ విలువ రూ.70 వేల కోట్లు. ఈ కాంట్రాక్టు బిల్ గేట్స్ చేజిక్కడంతో మార్కెట్లో మైక్రోసాఫ్ట్ షేర్ల విలువ రివ్వున పైకెగిసింది. షేర్ల విలువ ఒక్కసారిగా నాలుగు శాతం పెరగడంతో గేట్స్ సంపద 110 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో రూ.7.7 లక్షల కోట్లు!

బెజోస్ విషయానికొస్తే భార్యకు విడాకుల సమయంలో ఇచ్చిన రూ.4.3 లక్షల కోట్ల భరణం, మూడో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు ఆయనను రెండో స్థానంలో నిలిపాయి. మూడో స్థానంలో యూరప్ సంపన్నుడు బెర్నార్డ్ ఆర్నాల్డ్ (107 బిలియన్ డాలర్లు) ఉన్నారు. ఇక, భారత్ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ ప్రపంచస్థాయిలో 14వ స్థానంలో ఉన్నట్టు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. ముఖేశ్ సంపద విలువను 56.7 డాలర్లుగా పేర్కొన్నారు.

More Telugu News