ISRO: విక్రమ్ ల్యాండింగ్ ను సాఫ్ట్ వేర్ దెబ్బకొట్టింది : ఇస్రో ప్రాథమిక అంచనా

  • చివరి నిమిషంలో వైఫల్యానికి అదే కారణం
  • స్పేస్ కమిషన్‌కు అంతర్గత నివేదిక
  • పరీక్షల సమయంలో ఎటువంటి సమస్య బయటపడలేదు

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో జాబిల్లి పై విక్రమ్ ల్యాండర్ దిగడం చివరి నిమిషంలో వైఫల్యానికి సాఫ్ట్ వేర్ కారణమని ఇస్రో ప్రాథమికంగా నిర్థారించింది. సాఫ్ట్ వేర్ విఫలం కావడంతో జాబిల్లి పై దిగడంలో ల్యాండర్ గతి తప్పిందని తేల్చింది. ఈ మేరకు స్పేస్ కమిషన్‌కు అంతర్గత నివేదిక సమర్పించినట్లు సమాచారం. జూలై 21న కక్ష్యలోకి చేరిన విక్రమ్ ల్యాండర్ దాదాపు 48 రోజులపాటు కక్ష్యలో పలు దిశలు మార్చుకుంటూ చంద్రుడి కక్ష్యలో చేరిన విషయం తెలిసిందే. సెప్టెంబరు ఏడవ తేదీ రాత్రి 1.45 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం పై దిగడం ఆరంభమైంది. చంద్రుని ఉపరితలం మరో 2.1 కిలోమీటర్ల దూరం ఉందనగా విక్రమ్ జాడ కనిపించకుండా పోయింది.

భారత అంతరిక్ష కేంద్రంతో ల్యాండర్‌కు సంబంధాలు కూడా తెగిపోయాయి. వాస్తవానికి విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడిపోయి దాదాపు 30 కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించింది. 'రఫ్ బ్రేకింగ్' దశ నుంచి ఫైన్ బ్రేకింగ్ దశకు వచ్చినప్పుడు సమస్య మొదలయ్యింది. దీనికి అమర్చిన ధ్రస్ట్ ల్లో ఒక దానికి మండించి సెకనుకు 146 మీటర్లు ప్రయాణించేలా నియంత్రించే క్రమంలో అదుపుతప్పింది. ఫలితంగా సెకనుకు 750 మీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది.

దీంతో విక్రమ్ ల్యాండర్, రోవర్ దెబ్బతిన్నాయి. ఈ వైఫల్యం పై లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ వి.నారాయణ నేతృత్వంలోని అంతర్గత కమిటీ అధ్యయనం చేసింది. ఈ కమిటీకి నాసా నుంచి కొంత సమాచారం లభించింది. వీటి పై చేసిన అధ్యయనం సాయంతో వచ్చే ఏడాది నవంబర్ లో జరగబోయే చంద్రయాన్-3కి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు.

More Telugu News