Maharashtra: మహారాష్ట్రలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్

  • తమకు 119 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటన
  • రైతుల సమస్యలపై రేపు గవర్నర్ ను కలువనున్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు
  • ఇది ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికేనని అనుమానం వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా అవతరించిందని పార్టీ నేత చంద్రకాంత్ పాటిల్ అన్నారు. తమ పార్టీకి 119 మంది ఎమ్మెల్యేల మద్దతుందని.. త్వరలోనే తాము  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యమన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు.

కాగా, ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఈ పార్టీలు స్పష్టంగా ప్రకటన చేయలేదుకాని, మరోవైపు ఈ పార్టీల నేతలు రైతుల సమస్యలపై రేపు గవర్నర్ ను కలువనున్నామని ప్రకటించాయి. గవర్నర్ తో ఈ పార్టీల నేతల భేటీపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికే వీరు గవర్నర్ ను కలుస్తున్నారని పేర్కొంటున్నారు.

288 అసెంబ్లీ సీట్లున్న అసెంబ్లీలో బీజేపీకి 105 స్థానాలు, శివసేనకు 56, కాంగ్రెస్ కు 44, ఎన్సీపీ కు 54 స్థానాలు, ఇతర పార్టీలకు 6 సీట్లు స్వతంత్రులకు 13 స్థానాలున్నాయి. అధికారం చేపట్టాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంటుంది. ఈ నేపథ్యంలో చంద్రకాంత్ ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News