చైనాపై నేపాల్ ప్రజల ఆగ్రహం.. జిన్ పింగ్ దిష్టిబొమ్మల దగ్దం

12-11-2019 Tue 12:22
  • నేపాల్ భూభాగాన్ని ఆక్రమించుకున్న చైనా
  • చైనాపై నేపాల్ లో వెల్లువెత్తుతున్న నిరసనలు
  • మా భూభాగాన్ని అప్పగించాలంటూ నినాదాలు
తమ భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ చైనాపై నేపాల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చైనాపై వారు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బర్దియా, కపిలవస్తు, సాప్తారి జిల్లాలో నిరసనకారులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'చైనా వెనక్కి వెళ్లు... మా భూభాగాన్ని అప్పగించు' అంటూ నినదించారు. చైనా అధినేత జిన్ పింగ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ ఇటీవల తమ తాజా సర్వే రిపోర్ట్ ను విడుదల చేసింది. ఇందులో 36 హెక్టార్ల నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని పేర్కొంది. మరోవైపు, వందలాది హెక్టార్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని సంబంధిత మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో, చైనాకు వ్యతిరేకంగా నేపాల్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.