TN Seshan: జయలలిత జాతకాన్ని రాసిన టీఎన్ శేషన్.. ఆయన ఆత్మకథలో ఆసక్తికర అంశాలు!

  • రాజయోగంతో ఉన్నా ఇబ్బందులే
  • జయలలితకు ఇదే విషయాన్ని వెల్లడించాను
  • ఆత్మకథలో రాసుకున్న టీఎన్ శేషన్

తమిళనాడులో తిరుగులేని మహిళా నేత జయలలిత జాతకంలోనే తేడా ఉందని, ఆమె అద్భుతమైన రాజయోగంతో ఉన్నా, అది ఉచ్ఛస్థితికి, అధోస్థితికి మధ్య తిరుగుతూ ఉంటుందన్న సంగతి తనకు ముందే తెలుసునని, 1990లలో న్నికల సంస్కర్తగా పేరు తెచ్చుకున్న టీఎన్ శేషన్ తన ఆత్మకథలో రాసుకున్నారు. రెండు రోజుల క్రితం శేషన్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రాసుకున్న ఆత్మకథలోని పలు అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీటిల్లో ఆయన జయలలితపై చేసిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తనకు జాతకాలు చూడటం తెలుసునని, ఎవరి జాతకాన్ని అయినా పరిశీలించి, సదరు వ్యక్తి ఎలాంటి గుణగణాలు కలిగి వుంటాడో, భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పేయగలనని అన్నారు. జాతకాలను తాను నమ్ముతానని చెప్పారు. ఓ ప్రముఖ వ్యక్తి నుంచి తనకు జయలలిత జాతకం లభించిందని, దాన్ని చూసిన తరువాత తాను నివ్వెర పోయానని అన్నారు.

అటువంటి జాతకం ఉండటం అత్యంత అరుదని, అయితే, ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ఒకే రకమైన గుణాన్ని కలిగి ఉండటం అరుదని ఆయన రాసుకున్నారు. జయలలిత జాతక చక్రం ఉన్నత స్థితికి, అధోస్థితికి మధ్య నిత్యమూ తిరుగుతూనే వుంటుందని తనకు తెలిసిందన్నారు. 1991 వరకూ ఆమెకు మంచి జరిగిందని,  ఆపై ఎదురుగాలేనని తాను ముందే తెలుసుకున్నానని వెల్లడించారు.

అప్పటికే ఈసీ బాధ్యతల్లో ఉన్న తాను ఇదే విషయాన్ని ఆమె వద్దకు వెళ్లి చెబితే, ప్రతికూలత ఎదురవుతుందన్న ఆలోచనలో తనకు తెలిసిన విషయాలను మనసులోనే ఉంచుకున్నానని చెప్పారు. గడ్డురోజులు వస్తున్నాయని తాను జయలలితతో చెప్పలేకపోయానని ఆత్మకథలో రాసుకున్నారు.

1993 మార్చి 20న చెన్నైలో తానున్నానని, ఆ సమయంలో జయలలిత నుంచి తనకు కబురు వచ్చిందని, వెంటనే తాను వెళ్లానని గుర్తు చేసుకున్న శేషన్, మీ జాతకాన్ని పరిశీలించానని చెప్పగా, ఎలావుందో తెలుసుకునేందుకు ఆమె ఆసక్తిని కనబరిచారని అన్నారు. కొంత తడబడుతూనే , "మీది మంచి జాతకమే. కానీ ఇకపై ఏ విషయమైనా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. మంచి రోజులు ఇకలేవు. రానున్నవి గడ్డు రోజులే" అని తాను బదులిచ్చానని వెల్లడించారు.

జయలలితకు దైవభక్తి అపారమని, దేవుడే తనను కాపాడుకుంటారని ఆమె వ్యాఖ్యానించారని అన్నారు. ఓ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగిన ఆమె, ఆపై క్రమంగా క్షీణ దశకు జారుకుంటారని శేషన్‌ ముందుగానే వెల్లడించడం గమనార్హం.

More Telugu News