Bangladesh: మ్యాచ్ ను మలుపు తిప్పిన శివం దూబే, చహర్ విజృంభణ... టి20 సిరీస్ భారత్ కైవసం

  • మూడో టి20లో బంగ్లాదేశ్ పై టీమిండియా విజయం
  • 3 వికెట్లతో సత్తా చాటిన దూబే
  • చహర్ కు 6 వికెట్లు
నాగ్ పూర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో భారత్ 30 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 175 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీం విధ్వంసక ఆటతీరుతో భయపెట్టినా, ఆల్ రౌండర్ శివం దూబే (3/30) సరైన సమయంలో విజృంభించాడు. నయీంతో పాటు ఆతిఫ్ హుస్సేన్ (0)ను కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. అంతకుముందు ప్రమాదకర ముష్ఫికర్ రహీమ్ ను అవుట్ చేసి భారత్ కు మ్యాచ్ పై ఆశలు కల్పించింది కూడా దూబేనే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

భారీ లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా జట్టును మీడియం పేసర్ దీపక్ చహర్ బంగ్లాను ఆరంభంలోనే దెబ్బతీశాడు. చహర్ దాటికి 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా, నయీం మెరుపుదాడితో బంగ్లా కోలుకుంది. నయీం 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు.  మొత్తమ్మీద పరుగుల వేటలో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. చివర్లో చహర్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి బంగ్లా ఇన్నింగ్స్ కు చరమగీతం పాడాడు. ఈ మ్యాచ్ లో చహర్ కు 6 వికెట్లు లభించాయి. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ 2-1తో భారత్ వశమైంది.
Bangladesh
India
T20
Cricket
Nagpur

More Telugu News