ayyappa: అయ్యప్ప భక్తుల విషయంలో డీజీపీ ఆఫీస్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.. వాటినే అమలు చేస్తున్నాం: రాచకొండ సీపీ మహేశ్ భగవత్

  • అయ్యప్ప మాల వేసుకొనే పోలీసులు సెలవుపై వెళ్లాలని ఇటీవల ఆదేశాలు
  • పలువురి నుంచి విమర్శలు
  • సర్వీస్‌ నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నామన్న మహేశ్ భగవత్ 

అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేపట్టే పోలీసులు రెండు నెలలు సెలవుపై వెళ్లాలని ఇటీవల రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అంతర్గతంగా సర్కులర్ కూడా జారీ అయింది. అయితే, దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు మండిపడ్డారు. ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలా సడలింపు ఇస్తారో, హిందువులకు కూడా అలాగే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ.. మాల వేసుకొని విధుల్లోకి రావొద్దంటూ ఆదేశించాలని ఎవరు ఆర్డర్ వేశారని నిలదీశారు. ఈ నేపథ్యంలో దీనిపై తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మహేశ్ భగవత్ ఈ విషయంపై స్పందించారు. పోలీసులు విధులు నిర్వహించే క్రమంలో సర్వీస్‌ నిబంధనల మేరకు వ్యవహరించాలని డీజీపీ ఆఫీస్‌ నుంచి  ఉత్తర్వులు వచ్చాయని, వాటినే తాము అమలు చేస్తున్నామని తెలిపారు. అయ్యప్ప భక్తుల విషయంలో కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ విషయంపై కొందరు రాచకొండ పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని తెలిపారు.

More Telugu News