Chandrababu: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించిందీ, నిందితులపై కేసులు పెట్టి జైలుకు పంపిందీ టీడీపీ ప్రభుత్వమే: చంద్రబాబు

  • అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కారు చెక్కుల పంపిణీ
  • ఆదుకునే ప్రక్రియను తాము గతంలోనే మొదలుపెట్టామన్న చంద్రబాబు
  • వైసీపీ నేతలు బాధితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ఏపీ సర్కారు అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించిందీ, నిందితులను జైలుకు పంపిందీ టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దుర్వినియోగం కాకుండా కాపాడింది కూడా టీడీపీ సర్కారేనని తెలిపారు. తమ హయాంలో ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 100 కుటుంబాలకు రూ.5 కోట్ల మేర అందించామని తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితుల జాబితా సేకరించి తొలి విడత పంపిణీకి రూ.336 కోట్లు సిద్ధం చేశామని, ఇప్పుడా మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం రూ.264 కోట్లకు తగ్గించిందని చంద్రబాబు ఆరోపించారు. బడ్జెట్ లో రూ.1150 కోట్లు కేటాయించి, ఇప్పుడెందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ దోచుకుందన్న ఆరోపణలు ఇప్పుడేమయ్యాయని నిలదీశారు. అగ్రిగోల్డ్ అంశంపై దుష్ప్రచారం చేసి బాధితులను మనోవేదనకు గురిచేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

More Telugu News