Devineni Uma: అక్రమాలపై ప్రశ్నిస్తారనే భయంతోనే జగన్ మీడియా ముందుకు రావడంలేదు: దేవినేని ఉమ

  • సీఎం జగన్ పై ఉమ ధ్వజం
  • సిమెంటు కంపెనీలతో బేరం కుదుర్చుకున్నారని ఆరోపణ
  • వైసీపీ ఎమ్మెల్యేలపైనా విమర్శలు
సీఎం జగన్ పైనా, వైసీపీ నేతలపైనా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు. సమస్యలు, అక్రమాలపై ప్రశ్నిస్తారన్న భయంతోనే సీఎం జగన్ మీడియా ముందుకు రావడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రతరం కావడంతో అనేకమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం అసలు సమస్యను పట్టించుకోకుండా విపక్షాలపై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ శాసనసభ్యులు ఇసుక అమ్ముకోవడంలో తలమునకలై ఉన్నారని, మరోవైపు ఒక్కో సిమెంటు బస్తాకు రూ.10 చొప్పున దోచుకునేలా సిమెంటు కంపెనీలతో సీఎం బేరం కుదుర్చుకున్నారని ఉమ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Devineni Uma
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News