బుల్లితెర హిందీ నటి తేజస్వికి అసభ్య వీడియో కాల్స్

04-11-2019 Mon 15:31
  • ఫోన్ హ్యాక్ అయిందన్న నటి
  • తన వాట్సాప్ నుంచి స్నేహితులకూ.. వీడియో కాల్స్
  • సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న నటీమణి
తన ఫోన్ నుంచి వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయవద్దని హిందీ బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్ తన స్నేహితులను, బంధువులను కోరింది. తన ఫోన్ హ్యాకింగ్ కు గురయిందని ఆమె తెలిపింది. ఈ వివరాలను నటి మీడియాకు వివరించింది.

‘నిన్న నేను సీరియల్ షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు ఒక అపరిచితుడి నుంచి వీడియో కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే అతను అసభ్య చేష్టలకు పాల్పడుతూ కనిపించాడు. నాకు జుగుప్స, బాధ కలిగాయి. నా చుట్టూ మనుషులు ఉన్నారు. అతడు నా ఫోన్ ను హ్యాక్ చేసి నా స్నేహితులతో చాట్ చేసి వాళ్లకు కూడా అసభ్య వీడియో కాల్స్ చేశాడు. వారు కూడా షాక్ కు గురయ్యారు’ అని చెప్పారు.

 ప్రస్తుతం తాను షూటింగ్ లో బిజీగా ఉండటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నానని అన్నారు. త్వరలో సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ ఘటనతో తాను మానసికంగా వేదనకు గురయ్యానని, హ్యాకర్ల విషయంలో అందరూ అప్రమత్తతతో ఉండాలని ఆమె హెచ్చరించారు. స్వరరాగిణి సీరియల్ లో టైటిల్ పాత్ర పోషించిన తేజస్వి తన నటనతో ఎంతో మంది అభిమానుల ఆదరణను చూరగొన్నారు.