Pawan Kalyan: జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేనెళ్లి సినిమాలు చేసుకుంటా: పవన్ కల్యాణ్

  • విశాఖలో లాంగ్ మార్చ్
  • బహిరంగ సభలో పవన్ ఆవేశపూరిత ప్రసంగం
  • వైసీపీ సర్కారుపై విమర్శల వర్షం

విశాఖపట్నంలో ఈ సాయంత్రం నిర్వహించిన లాంగ్ మార్చ్ ర్యాలీలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. తనకు దత్తపుత్రుడు అని, బి-టీమ్ అని పేర్లు పెట్టారని, వాళ్లకు బలమైన సమాధానం చెబుతానని అన్నారు. తాను కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడ్నని అన్నారు. తాను డబ్బుతో పార్టీ నడపడంలేదని, నికార్సయిన భావజాలంతో పార్టీ నడుపుతున్నానని స్పష్టం చేశారు. ఇవాళ ఇంతమంది వచ్చారంటే ప్రజల్లో ఎంత ఆవేదన ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

"వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేనెళ్లి సినిమాలు చేసుకుంటా. నాకిదంతా అవసరంలేదు. సగటు రాజకీయనాయకుడు బాధ్యతగా ఉండుంటే నేను జనసేన పార్టీ పెట్టేవాడ్నే కాదు. ఏవో నాలుగు పుస్తకాలు చదువుకుంటూ ఇంటివద్దే ఉండేవాడ్ని. సినిమాల్లోనూ పొరబాటుగా వచ్చా. కానీ సగటు రాజకీయనాయకుల విధివిధానాలు ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే సామాన్యుల్లోంచి వచ్చే నాయకులు పుడతారు. ఆ విధంగానే నేను వచ్చాను తప్ప రాజకీయాలేం నాకు సరదా కాదు.

వైసీపీ వాళ్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, వాళ్లకు నా కోపం తెలుసా? రాజకీయాలంటే నాకు బాధ్యత. కష్టపడి పనిచేసే శ్రామికుల బాధలు నాకు తెలుసు. ఇవాళ వైసీపీ నేతలు ఒక్కో ఎమ్మెల్యే లక్షల్లో తీసుకుంటున్నారు. కార్మికుల జీవితాలు ఏ రోజుకు ఆ రోజు గడిచే బతుకులు. జగన్ రెడ్డిలా వాళ్ల వద్ద వేల కోట్లు లేవు. భవన నిర్మాణ కార్మికులే లేకపోతే ఈ భవనాలు ఉండేవా, మనం ఎక్కడ ఉండేవాళ్లం!" అంటూ ధ్వజమెత్తారు.

More Telugu News