KCR: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు: సీఎం కేసీఆర్ పునరుద్ఘాటన

  • కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
  • దాదాపు 5 గంటల పాటు సాగిన భేటీ
  • ఆర్టీసీ సమ్మె ప్రధాన అజెండాగా సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సాయంత్రం రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైంది. గత కొన్నివారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రధాన అజెండాగా క్యాబినెట్ సమావేశం సాగింది. దాదాపు 5 గంటల పాటు సాగిన సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 49 అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగిందని చెప్పారు. ఆర్టీసీ సమస్యపై సుదీర్ఘంగా చర్చించామని, పండుగలు, పరీక్షల వంటి కీలక సమయాల్లో బెదిరింపులకు దిగుతూ, సమ్మెలు చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని నిర్ణయించామని తెలిపారు. సున్నితమైన సమయాల్లో సమ్మెలు చేయడం బ్లాక్ మెయిల్ తరహా పన్నాగాలు అని ఆరోపించారు.

సమ్మెకు వెళ్లకూడదని ఆర్టీసీ కార్మికులకు చెప్పినా వినలేదని తెలిపారు. ఆర్టీసీ వాళ్లు అర్థరహితంగా, దురాశాపూరితంగా సమ్మె బాట పట్టారని ఆరోపించారు. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తో ఆర్టీసీ సమ్మె చేపట్టిందని, ఇలాంటి బ్లాక్ మెయిల్ వ్యవహారాలు ఇకమీదట ఉండకూడదని భావిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరని పని అని సీఏం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు స్థానం కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని అన్నారు. అందుకే 5100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని క్యాబినెట్ లో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. పూర్తిగా పనికిరాకుండా పాడైపోయిన బస్సుల స్థానాన్ని ఈ ప్రైవేటు బస్సులతో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. నవంబరు 5 అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరకపోతే ఈ నిర్ణయం వెంటనే అమలవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ రూట్లలో బస్సులు తిప్పేందుకు ప్రైవేటు ఆపరేటర్లు కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

More Telugu News