Nirmal District: ప్రియుల మోజులో పడి.. కట్టుకున్న వాడినే హత్య చేయించింది!

  • తన వ్యవహారాలకు అడ్డుగా ఉన్నాడని హత్య
  • ఎక్కడికో వెళ్లిపోయాడని నాటకం
  • ఐదు నెలల తర్వాత హత్యోదంతాన్ని ఛేదించిన పోలీసులు

ఇద్దరు ప్రియుల మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న వాడు తన వ్యవహారాలకు అడ్డుగా ఉన్నాడని భావించి, అతన్ని ప్రియులతో కలిసి పథకం వేసి హత్య చేయించింది. అనంతరం ఎక్కడికో వెళ్లిపోయాడని కట్టుకథ అల్లినా పోలీసుల రంగ ప్రవేశంతో గుట్టురట్టయింది.

పోలీసుల కథనం మేరకు... తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని ఐదు నెలల క్రితం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవం వద్ద లభించిన ఆధారాలను భద్రపరిచి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి శవానికి అంత్యక్రియలు జరిపించారు. మృతుని ఫొటోను అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు పంపించారు.

ఇదిలావుండగా... నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ వాసి గుజ్జేటి ఉదయ్‌కుమార్‌ (40), పావని అలియాస్‌ లావణ్య దంపతులు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. పావనికి కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం తాడ్‌గూర్‌కు చెందిన దౌలాజీ, చేంగల్‌కు చెందిన గంగాధర్‌తో వివాహేతర సంబంధాలు వున్నాయి. తన వ్యవహారాలకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని చంపాలనుకుంది. ఇందుకోసం ప్రియులు ఇద్దరినీ పురమాయించింది.

కూతురు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు అవసరమైన డబ్బు దౌలాజీ, గంగాధర్‌ ఇస్తారని చెప్పి వారితో ఉదయ్‌ను ఆర్మూర్‌ పంపింది. ముగ్గురూ పోస్కల్‌ వచ్చి మద్యం సేవించారు. అనంతరం పావనికి ఫోన్‌ చేసి చంపేయమంటావా? అని అడిగారు. ఆమె సరే అనడంతో సమీపంలోని గోదావరిలోకి తీసుకువెళ్లి ముంచి చంపేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు వచ్చేశారు.

ఈ నేపథ్యంలో గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం, అదే సమయంలో ఉదయ్‌కుమార్‌ కనిపించడం లేదని ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త కనిపించకపోయినా ఎటువంటి దిగులు లేకుండా పావని తిరుగుతుండడం, పరాయి వ్యక్తితో గడుపుతుండడంతో పోలీసులకు ఆమెపైనే అనుమానం వచ్చి నిఘాపెట్టారు.

దౌలాజీతో కలిసి పావని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో హత్యోదంతం బయటపడింది. దౌలాజీతోపాటు హత్యలో గంగాధర్‌ ప్రమేయం కూడా ఉందని గుర్తించారు. దీంతో పావని, దౌలాజీలను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌ వెళ్లిన గంగాధర్‌ను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News