Supreme Court: రూ.403 కోట్ల విలువైన కేసులను వెనక్కి తీసుకున్న ఐటీ శాఖ

  • సుప్రీంకోర్టు, తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న కేసులు వెనక్కి
  • మొత్తం 969 కేసులను ఉపసంహరించుకున్న ఆదాయపు పన్ను శాఖ
  • పన్ను చెల్లింపుదారులతో స్నేహపూర్వక సంబంధాలలో భాగం!

దావాల తగ్గింపు చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టుతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో ఉన్న కేసులను ఉపసంహరించుకుంది. మొత్తం రూ.403 కోట్ల విలువైన 969 కేసులను వెనక్కి తీసుకున్నట్టు ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులతో స్నేహపూర్వకంగా మెలిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ (సీబీడీటీ) ఇటీవల జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే కేసులను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది.

కేసుల ఉపసంహరణలో భాగంగా  ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ వద్ద రూ. 50 లక్షలు, హైకోర్టులో రూ.కోటి, సుప్రీం కోర్టులో రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన కేసులను ఉపసంహరించుకున్నట్టు వివరించింది. ఇలా మొత్తం రూ.403 కోట్ల విలువైన 969 కేసులను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. అయితే, కేసులను ఇలా ఉపసంహరించుకోవడం ఇదే తొలిసారి కాదని, గతేడాది కూడా 892 కేసులను వెనక్కి తీసుకున్నట్టు పేర్కొంది.

More Telugu News