IAS: ఇద్దరు ఐఏఎస్ లు ప్రభుత్వం ఏది చెబితే అది అఫిడవిట్ లో రాసుకొచ్చారు: అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యలు

  • తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కోర్టులో నేడు విచారణ
  • ఆర్టీసీ సమర్పించిన అఫిడవిట్ జీహెచ్ఎంసీ తరఫున ఇచ్చినట్టుందని వ్యాఖ్యలు
  • ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు

ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్ జీహెచ్ఎంసీ కోసం దాఖలు చేసిన అఫిడవిట్ లా ఉందని విమర్శించారు. ఇద్దరు ఐఏఎస్ లు ప్రభుత్వం ఏది చెబితే అది అఫిడవిట్ లో రాసుకొచ్చినట్టుగా ఉందని అన్నారు.

కోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిందని, ఆర్టీసీ తరఫున అఫిడవిట్ దాఖలు చేశారా? లేక, ఇంకెవరి తరఫునైనా దాఖలు చేశారా? అని న్యాయస్థానం ప్రశ్నిస్తే ఆర్టీసీ యాజమాన్యం సమాధానం చెప్పలేకపోయిందని ఎద్దేవా చేశారు. అధికారులు ఉన్నది ఆర్టీసీని రక్షించడానికా లేక అమ్ముకోవడానికో తెలియాలని అశ్వత్థామరెడ్డి నిలదీశారు. ఇకనైనా ఆర్టీసీ యాజమాన్యం కళ్లు తెరవాలని హితవు పలికారు. సమ్మె కొనసాగుతున్న స్థితిలో, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉండడం సబబు కాదని అన్నారు.

More Telugu News