central empoyees: ఇక ఏడాది పనిచేస్తే చాలు... గ్రాట్యుటీకి అర్హత : ఉద్యోగులకు కేంద్రం మరో వరం?

  • ఇప్పటి వరకు ఈ పరిమితి ఐదేళ్లు
  • దీనికి సంబంధించి శీతాకాల సమావేశాల్లో బిల్లు
  • ఇప్పటికే డీఏ పెంచి దీపావళి కానుక అందించిన బీజేపీ సర్కారు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బీజేపీ ప్రభుత్వం మరో వరాన్ని ప్రసాదించేందుకు సిద్ధమవుతోంది. ఏ సంస్థలోనైనా ఉద్యోగి కనీసం ఏడాదిపాటు పనిచేస్తే ఇకపై గ్రాట్యుటీకి అర్హత పొందుతాడు. ఇప్పటి వరకు ఈ పరిమితి ఐదేళ్లు. దీనివల్ల ఏ కారణంగానైనా సంస్థలో మానేసినా, మరో సంస్థలో చేరినా ఉద్యోగులకు ఎంతో నష్టం జరిగేది. ఇకపై ఆ సమస్య ఉండకూడదని తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సాధారణంగా ఓ ఉద్యోగి ఐదేళ్ల ఉద్యోగ జీవితం పూర్తయ్యాక మొత్తం సర్వీసు కాలానికి ఏడాదికి 15 రోజులు చొప్పున గ్రాట్యుటీ లెక్కకడతారు. ఇప్పుడు ఏడాది పూర్తయితే చాలు, మొత్తం సర్వీసు కాలానికి ఈ నిబంధన వర్తిస్తుందన్నమాట. ఇటీవలే డీఏ పెంపుదల చేస్తూ దీపావళి కానుక అందించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో మరింత జోష్‌ నింపనుంది.

ఇప్పటికే ఈ అంశంపై సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం కేంద్రం విడుదల చేయలేదు.

More Telugu News