Hyderabad: కోతిపిల్లను నిర్బంధించినందుకు రూ.10 వేలు జరిమానా!

  • వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు
  • యాచక కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌
  • కోతి పిల్లను స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో విడుదల

కోతిపిల్లను నిర్బంధించి దాని ద్వారా యాచక వృత్తిని చేపడుతున్న ఓ కుటుంబానికి అటవీ శాఖ అధికారులు పదివేల రూపాయల జరిమానా విధించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద మూగజీవాలను నిర్బంధించడం నేరం. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించగా వారు విచారణ జరిపి జరిమానా విధించారు.

ఉప్పల్‌ పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...సిద్ధిపేట జిల్లా పొన్నాలకు చెందిన కోట పోచయ్య, పోచమ్మ దంపతులు గాడిదపాలు విక్రయిస్తూ, యాచన చేస్తూ జీవిస్తున్నారు. వీరు తమ పన్నెండేళ్ల కొడుకుతో కలిసి మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు.

వీరి కొడుకు కోతి పిల్లను గొలుసులతో బంధించి భిక్షాటన చేస్తుండగా ‘కంపాశనేట్‌ సొసైటీ ఫర్‌ ఏనిమల్స్‌ (జంతువుల పట్ల కారుణ్యం చూపే సంఘం)’ వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగారం ప్రవళ్లిక చూశారు. ఆ బాలుడిని, కోతిపిల్లను తీసుకుని ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు రప్పించి ముగ్గురికీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

అనంతరం కోతిపిల్లను, బాలుడిని, అతడి తల్లిదండ్రులను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కోతిపిల్లను చెంగిచర్ల అటవీ ప్రాంతంలో వదిలేసిన అటవీ అధికారులు విచారణ అనంతరం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద బాలుడి కుటుంబానికి రూ.10 వేలు జరిమానా విధించారు.

More Telugu News