Keerthi: 'తల్లిని చంపిన కీర్తి' కేసులో మరో మలుపు... అసలు నిందితుడు ప్రియుడు శశికుమార్!

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కేసు
  • ప్రియుడి బెదిరింపులతోనే తల్లి హత్య
  • నేడు అరెస్ట్ ను చూపే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన కీర్తి కేసులో పోలీసులు మరో సంచలన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో కీర్తిని బెదిరించి లొంగదీసుకున్న శశికుమార్ ప్రధాన సూత్రధారని, ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి, కీర్తితో హత్య చేయించాడని పోలీసులు తేల్చారు.

రజిత హత్య కేసులో ఏ1గా శశికుమార్ పేరును చేర్చినట్టు వెల్లడించారు. ఇటీవల కీర్తికి వివాహం కుదిరిన తరువాత శశికుమార్ బెదిరింపులు మరింతగా పెరిగిపోయాయని, ఆ వీడియోలు, తమ మధ్య ఉన్న బంధం గురించి చేసుకోబోయే వ్యక్తికి చెబుతానని బ్లాక్ మెయిల్ చేయగా, భయపడిన కీర్తి, కన్న తల్లని కూడా చూడకండా రజితను హత్య చేయాలని నిర్ణయించుకుందని అన్నారు.

ఈ కేసును ఛేదించే క్రమంలో సెల్ ఫోన్ వీడియోలు, వాట్స్ యాప్ చాటింగ్, కాల్ డేటా తమకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించాయని పోలీసులు వెల్లడించారు. బీటెక్ చదివి కూడా జులాయిగా తిరుగుతున్న శశికుమార్, అందంగా ఉన్న కీర్తిని ప్రేమలోకి దింపితే, ఆస్తి కూడా కలిసి వస్తుందని ప్లాన్ వేశాడని చెప్పారు. ఇదే సమయంలో నిత్యమూ తాగి వచ్చి ఇంట్లో గొడవచేసే తండ్రి వైఖరితో విసుగు చెందిన ఆమె, శశికుమార్ ను పూర్తిగా నమ్మింది.

ఓ మారు ఆమె గర్భం దాల్చగా మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించాడు. కీర్తిని తాను చేసుకోవడానికి రజిత నిరాకరించడం, ఆపై కీర్తికి బాల్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరవ్వడంతో, బెదిరింపులకు దిగిన శశికుమార్, ఆమె చేతనే తల్లిని హత్య చేయించాడు. కాగా, రెండు నెలల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ పోలీసులకు చిక్కిన మహబూబ్ నగర్ ఎలక్ట్రికల్ ఏఈ పర్వతం మూడో భార్య మూడో కుమారుడే ఈ శశికుమార్ అని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్ ను నేడు చూపనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News