Priyanka Gandhi: మన ఎంపీలను అనుమతించరు.. ఈయూ ఎంపీలకు మాత్రం స్వాగతం పలుకుతున్నారు: ప్రియాంక గాంధీ

  • భారత ఎంపీలను విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపుతున్నారు
  • ఇటువంటి అపూర్వమైన జాతీయవాదం వారిది 
  • జమ్మూకశ్మీర్ లో ఈయూ ఎంపీల పర్యటనపై ప్రియాంక విమర్శలు

జమ్మూకశ్మీర్ లో ఈ రోజు యూరోపియన్ సమాఖ్య (ఈయూ) దేశాలకు చెందిన 27 మంది ఎంపీలు పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వారు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో వారి పర్యటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు.

'కశ్మీర్ లో పర్యటించడానికి, ఆ విషయంపై జోక్యం చేసుకోవడానికి యూరోపియన్ ఎంపీలకు అనుమతి ఇస్తున్నారు. భారత్ కు చెందిన ఎంపీలు, నాయకులను మాత్రం విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపించేస్తున్నారు. ఇటువంటి అపూర్వమైన జాతీయవాదం వారిది'  అంటూ ఆమె ఎద్దేవా చేశారు.

కాగా, జమ్మూకశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ఈయూ ఎంపీలు అధ్యయనం చేస్తారు. దేశంలోని ఎంపీలకు అనుమతి ఇవ్వకుండా, ఈయూ ఎంపీలకు అనుమతి ఇచ్చారంటూ నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా విమర్శలు గుప్పించారు.

More Telugu News