Sunder Pichai: గూగుల్ సమావేశంలో సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు

  • సుందర్ పిచాయ్ మాట్లాడుతున్న వీడియో లీక్
  • కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయామన్న పిచాయ్
  • అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ

ఎన్నో అంశాల్లో గూగుల్ సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానిస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వీడియో ఒకటి లీకై కలకలం రేపింది. గడచిన గురువారం నిపుణుల సమావేశంలో పాల్గొన్న పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వివాదాస్పద అంశాలపై చర్చ విషయంలోనూ, ట్రంప్‌ తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్‌ ను గూగుల్‌ నియమించడాన్ని ఆయన ప్రస్తావించారు. కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని గూగుల్ కోల్పోయిందని పిచాయ్ అంగీకరించారు.

ఉద్యోగుల్లో తిరిగి నమ్మకాన్ని పెంచేందుకు, వారిలోని అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇదే మీటింగ్ లో పాల్గొన్న గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కరన్‌ భాటియా, టైలర్‌ సేవలను ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో గూగుల్ వినియోగించుకోబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతాంశాల్లో అతని సేవలను వాడుకుంటామన్నారు.  కాగా, సంస్థలో పనిచేసే ఉద్యోగులు వివాదాస్పద రాజకీయ అంశాలను చర్చించవద్దని ఇప్పటికే ఓ మెమో జారీ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News