Chandrababu: కుండపోత వర్షాలు కురుస్తుంటే నిర్మాణాలెలా జరుగుతాయి పచ్చకామెర్ల రోగుల్లారా?: విజయసాయిరెడ్డి

  • ప్రజలు మళ్లీ తననే కోరుకుంటున్నట్టు చంద్రబాబు కలవరిస్తున్నారు
  • పదవిలో ఉన్నది అనుభవించడానికే అని కొందరు అనుకుంటారు
  • వర్షాలు కురవొద్దని పచ్చ పార్టీ, బానిస పార్టీలు కోరుకుంటున్నాయి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మళ్లీ తానే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చంద్రబాబు కలవరిస్తున్నారని... తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 2.20 లక్షల మంది ఓటర్లలో 1800 మంది తిరిగి ఆయనను అధికారంలోకి రావాలని కోరుకుంటున్న మాట నిజమేనని ఎద్దేవా చేశారు. పోలైన ఓట్లలో ఒక్క శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడంటూ సెటైర్ వేశారు.  

'ఎయిర్ పోర్టులో చిరు తిండ్ల ఖర్చు 25 లక్షలు, ఒక్క రోజు ధర్నాకు 10 కోట్లు... ఇలా చెప్పుకుంటే పోతే జాబితా చాలా పెద్దది వస్తుంది. కొందరు పదవిలో ఉన్నది అనుభవించడానికే అనుకుంటారు. ఇసుక కొరత అని ఆందోళనకు దిగుతున్న పచ్చ పార్టీ, బానిస పార్టీలు కోరుకునేదేమిటంటే... వర్షాలు కురవొద్దు. నదులు, వాగులు ఉప్పొంగకూడదు. రిజర్వాయర్లు నిండొద్దు. నదులన్నీ ఎండిపోయి ఇసుక రాశులు తేలి ఉంటే ఏ కొరతా ఉండదు. ఇటువంటి తిరోగమన ఆలోచనలున్న వాళ్లు భూమికి భారం కాక మరేమిటి?

అధికారంలో ఉన్నప్పుడు ఇసుకనే నమ్ముకున్నారు. అమ్ముకున్నారు. ఇప్పుడు దాని పైనే రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తాత్కాలిక సమస్యపై ప్రజల్లో అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చేస్తారట. కుండపోత వర్షాలు కురుస్తుంటే నిర్మాణాలెలా జరుగుతాయి పచ్చకామెర్ల రోగుల్లారా?' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

More Telugu News