visakhapatnam: విశాఖ, యారాడ బీచ్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు!

  • నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో బీచ్‌ ఒకటి
  • అర్ధరాత్రి దాటాక ఘటన జరగడంతో తప్పిన ప్రమాదం
  • నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే కారణం 
విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం యారాడ బీచ్‌ రోడ్డులో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్‌కి వెళ్లే ప్రధాన ఘాట్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మూడు వైపులా కొండ, ఓ వైపు సముద్రంతోపాటు కొబ్బరి, అరటి తోటలతో తీరంలో అహ్లాదకర వాతావరణం ఉంటుంది. అందుకే సుదూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తుంటారు.  నిత్యం జనసంచారం ఉండే ఈ రోడ్డులో ప్రమాదం కలకలం రేపింది. అయితే అర్ధరాత్రి తర్వాత ఘటన జరగడం, జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

నాలుగు రోజులుగా నగరం, జిల్లా పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం  నుంచి అర్ధరాత్రి వరకు భారీగా వర్షం కురిసింది. ఈ రోడ్డును ఆనుకుని ఉన్న కొండపై మట్టి వదులై పెద్దపెద్ద రాళ్లు రోడ్డుపైకి జారిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అధికారులు వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలను పంపుతున్నారు. మరోవైపు జీవీఎంసీ సిబ్బంది కొండ చరియలను తొలగించే పనులను హుటాహుటిన చేపట్టారు.
visakhapatnam
yarad beach road
accident

More Telugu News