pakistan boarder: సరిహద్దులో పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత

  • వరిపొలంలో సంచరిస్తుండగా కాల్పులు
  • భారోవల్‌లోని బీఎస్‌ఎఫ్‌ అవుట్‌పోస్టు వద్ద ఘటన
  • వారం రోజుల వ్యవధిలో రెండో ఘటన

పాకిస్థాన్‌ నుంచి భారతదేశ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న చొరబాటుదారుడిని సరిహద్దు భద్రతా బలగాలు కాల్చిచంపాయి. పంజాబ్‌ రాష్ట్ర సరిహద్దులో ఉన్న భారోవల్‌ బీఎస్‌ఎఫ్‌ అవుట్‌పోస్టు వద్ద నిన్నరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈనెల 16వ తేదీన కూడా ఓ వ్యక్తిని బలగాలు కాల్చిచంపాయి.

వివరాల్లోకి వెళితే...సరిహద్దు చెక్‌ పోస్టు సమీపంలోని వరిపొలంలో ఓ వ్యక్తి తచ్చాడుతున్నట్టు అనుమానించిన భద్రతా బలగాలు అది వాస్తవమని నిర్థారించుకున్నాయి. భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు అతను ప్రయత్నిస్తున్నాడని గుర్తించి వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించాయి. అతను తన ప్రయత్నాన్ని ఆపక పోవడంతో కాల్చిచంపినట్టు బీఎస్‌ఎఫ్‌ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 16వ తేదీన కూడా సరిహద్దులోని గేట్‌ నంబర్‌ 103 వద్ద భధ్రతా విధులు నిర్వహిస్తుండగా భారత్‌లోకి ప్రవేశించేందుకు గుల్నవాజ్‌ అనే వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించాడు.

అప్రమత్తమైన సైనికులు అతన్ని వెనక్కి వెళ్లాలని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, పాక్ సరిహద్దుల నుంచి ఫిరోజ్‌పూర్ హుసేనీవాలా సెక్టారులో నిన్న డ్రోన్ల సంచారాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వాటిపై కూడా కాల్పులు జరిపారు.

More Telugu News