Andhra Pradesh: ఏపీ అర్చక పరీక్షా ఫలితాల విడుదల

  • 2013 నుంచి అర్చకుల (ఆగమ) పరీక్షలను ఏ ప్రభుత్వం నిర్వహించలేదు
  • వైసీపీ హయాంలో అర్చకుల సమస్యలు పరిష్కరించాం 
  • దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అర్చకుల (ఆగమ) కోర్సులకు జరిగిన అర్చక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి ఈరోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2013వ సంవత్సరం నుంచి అర్చకుల (ఆగమ) పరీక్షలను ఏ ప్రభుత్వాలు నిర్వహించలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

ఈ క్రమంలోనే 2019 జులై 13,14 తేదీల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులకు ప్రవేశ, వర, ప్రవర, ఆగమ పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు. ఆగమ పరీక్షలకు 5,176 మంది హాజరయ్యారని, వీరిలో మొత్తం 4,396 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రథమ శ్రేణిలో 2 వేల మంది, ద్వితీయ శ్రేణిలో 1,156 మంది, తృతీయ శ్రేణిలో 247, మౌఖిక, ప్రయోగ పరీక్షల్లో 993 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లంపల్లి ప్రకటించారు. 743 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, 37 మంది వేరొకరి సహాయంతో పరీక్షలకు హాజరైనవారిలో ఉన్నారని, మొత్తంగా 84.93 ఉత్తీర్ణత శాతంగా వుందని వివరించారు.

రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 25.11.2019 తేదీ లోపు కమిషనర్, దేవాదాయ శాఖ కార్యాలయానికి రూ.200 డీడీని జతపరిచి వివరాలను పంపాలని సూచించారు. పరీక్షల్లో తప్పిన వారికి సప్లిమెంటరీ పరీక్ష తొలిసారి ఏర్పాటు చేయడం జరుగుతుందని, పరీక్షల్లో తప్పినవారికి ఎటువంటి అనుమానాలు ఉన్నా అభ్యర్థుల కోరిక మేర వెరిఫికేషన్ కు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.

అర్చకుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నదానికి పరీక్షల నిర్వహణే నిదర్శమన్నారు. అర్చకుల (ఆగమ) పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అర్చకుల ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

అదేవిధంగా, అర్చకుల వంశపారం పర్య పురోహితం కోసం ప్రత్యేక జీవోని అందించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో కొన్ని చోట్ల రెవెన్యూ ఉద్యోగులు డిప్యుటేషన్ పై పనిచేయడం, దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు వంటి సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

అర్చకులకు విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలకు అవకాశం: కోన రఘుపతి

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ, చాలా కాలంగా అర్చకుల సమస్యలకు పరిష్కారం లభించక ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారని అన్నారు. ఆగమ పరీక్షలు నిర్వహించడం ద్వారా అర్చకులు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు పొందే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

అర్చకుల జీవితాల్లో ప్రభుత్వం మనోధైర్యం నింపింది: మల్లాది విష్ణు

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే తొలిసారిగా అర్చకుల పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక (ఆగమ) పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి గుర్తింపు పట్టాను ఇవ్వడం ద్వారా అర్చకుల జీవితాల్లో ప్రభుత్వం మనోధైర్యం నింపిందని అన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన అర్చక అభ్యర్థుల వివరాలను https://tms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

అనంతరం, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పద్మ మాట్లాడుతూ, ఆగమ పరీక్షలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. 25.11.2019 తేదీ అనంతరం వచ్చే అభ్యర్థనలు పరిశీలించమని తెలిపారు. జవాబు పత్రాలను పరిశీలించి ఫలితాన్ని వారికి పోస్టులో పంపనున్నట్లు తెలిపారు.

More Telugu News