చాలా కష్టపడి బోటును బయటకు తీశారు: మంత్రి అవంతి శ్రీనివాస్

22-10-2019 Tue 21:06
  • బోటు వెలికితీతకు చిత్తశుద్ధితో పనిచేశారు
  • ప్రభుత్వ యంత్రాగానికి, కష్టపడ్డ సిబ్బందికి ధన్యవాదాలు
  • పర్యాటక బోట్లకు విధివిధానాలు కఠినతరం చేస్తాం

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ, బోటు వెలికితీతకు సంబంధించి ఎటువంటి లోపం లేకుండా చిత్తశుద్ధితో తాము, అధికారులందరూ పనిచేశారని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు.

పర్యాటక బోట్లకు సంబంధించిన విధివిధానాలను రాబోయే రోజుల్లో కఠినతరం చేస్తామని వెల్లడించారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ప్రైవేట్ బోటు ఆపరేటర్లపై ఉందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి, బోటు వెలికితీత పనుల్లో కష్టపడ్డ సిబ్బందికి ప్రభుత్వం తరపున, తన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మృతదేహాలు దొరికిన వారి కుటుంబ సభ్యులకు ఏవిధంగా అయితే ప్రభుత్వ నష్టపరిహారం ఇచ్చామో, అదేవిధంగా, మృతదేహాలు లభ్యం కాని వారి కుటుంబాలకూ ఇస్తామని మరోమారు ఆయన స్పష్టం చేశారు.