Abu Dhabi: ప్రపంచంలోనే అతి పురాతన ముత్యం.. అబుదాబిలో గుర్తించిన పురావస్తు శాఖ

  • 8,000 ఏళ్ల క్రితం నాటి సహజమైన ముత్యం
  • మురావా ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో లభ్యం
  • క్రీస్తు పూర్వం 5800-5600 నాటికి చెందినదిగా గుర్తింపు

యూఏఈ రాజధాని అబుదాబి సమీపంలోని మురావా ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో ప్రపంచంలోనే అతి పురాతన ముత్యం లభ్యమైంది. ఇది 8,000 ఏళ్ల క్రితం నాటి సహజమైన ముత్యమని అక్కడి పురావస్తు శాఖ తెలిపింది. నవీన శిలాయుగంలోనూ ముత్యాల వాణిజ్యం ఉందన్న విషయాన్ని ఇది రుజువు చేస్తోందని అధికారులు తెలిపారు.

అబుదాబిలోని లౌవ్రే మ్యూజియంలో '10,000 ఏళ్ల లగ్జరీ' పేరిట ఈ నెల 30 నుంచి పారంభమయ్యే ప్రదర్శనలో ఈ ముత్యాన్ని చూడవచ్చని అధికారులు తెలిపారు. యూఏఈలోని ప్రస్తుత ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు చాలా లోతైన పునాదులు ఉన్నట్లు ఈ ముత్యం ద్వారా తెలుస్తోందని సాంస్కృతిక, పర్యాటకశాఖ ఛైర్మన్ మొహ్మద్ ఖలీఫా అల్ ముబారక్ తెలిపారు.

ఈ ముత్యం క్రీస్తు పూర్వం 5800-5600 నాటికి చెందినదిగా రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొన్నారు. ఆ కాలంలో వీటిని ఆభరణాలుగా వినియోగించేవారని, మెసొపొటేమియా నాగరికతగా పేర్కొంటున్న ఆ కాలంలో ఇరాక్ లో వీటి వాణిజ్యం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మురావాలో జరుపుతున్న తవ్వకాల్లో పింగాణీ వస్తువులతో పాటు రాళ్లతో తయారు చేసిన పూసల వంటి వస్తువులూ లభ్యమయ్యాయి.  


More Telugu News