'ఎగిరి' వచ్చిన మృత్యువు!

22-10-2019 Tue 11:28
  • విజయనగరం జిల్లాలో ఘటన
  • లారీ టైర్ పేలి గాల్లో దూసుకు వచ్చిన ఇనుప చట్రం
  • హెల్మెట్ పగిలి, తలకు తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి

మరణం అన్నది ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఘటనే విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ముసిరా గ్రామ వాసి అచ్చిబాబు (43) నిన్న సాయంత్రం తన బైక్ పై వెళుతున్నాడు. తలకు రక్షణగా హెల్మెట్ కూడా ధరించాడు. కొత్త వలస జంక్షన్ సమీపంలో విశాఖ నుంచి వస్తున్న లారీ అతనికి ఎదురుగా వచ్చింది. రెండు వాహనాలూ ఢీకొనలేదు కూడా. కానీ ప్రమాదం మరో రూపంలో ముంచుకొచ్చింది.

సరిగ్గా అచ్చిబాబు మోటార్ సైకిల్, లారీని దాటుతున్న సమయంలో లారీ టైరు ఒక్కసారిగా పేలింది. టైరుకు అమర్చివున్న ఇనుపచట్రం గాల్లో ఎగిరి, దూసుకొచ్చి, అచ్చి బాబు తలకు బలంగా తాకింది. దాని ధాటికి హెల్మెట్ ముక్కలు కాగా, తలకు తీవ్రగాయం అయింది. ఈ ప్రమాదంలో అచ్చిబాబు అక్కడికక్కడే మరణించగా, విషయం తెలుసుకున్న పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ, అతని ప్రమేయం ఏమాత్రం లేకపోయినా మృత్యువు తరుముకొచ్చిందని చర్చించుకున్నారు.