India: దక్షిణాఫ్రికా ఘోర ఓటమి... సిరీస్ క్లీన్ స్వీప్!

  • అత్యంత పేలవంగా సాగిన సౌతాఫ్రికా పర్యటన
  • రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకే ఆలౌట్
  • 3-0 తేడాతో సఫారీలను వైట్ వాష్ చేసిన భారత్

భారత్ లో దక్షిణాఫ్రికా పర్యటన అత్యంత పేలవంగా సాగగా, టెస్ట్ సిరీస్ లో 3-0 ఓటమితో ఘోర పరాజయం పాలైంది. రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో 133 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులు మాత్రమే చేసిన దక్షిణాఫ్రికా జట్టు, ఫాలో ఆన్ ఆడుతూ, రెండో ఇన్నింగ్స్ లోనూ పేలవమైన ఆటతీరునే ప్రదర్శించింది.
 
ఆట నాలుగో రోజైన నేడు, కేవలం 12 బంతుల్లో దక్షిణాఫ్రికా, తన వద్ద మిగిలివున్న రెండు వికెట్లనూ కోల్పోయింది. డీ బ్రూన్ ను 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేసిన నదీమ్, ఆ తరువాతి బంతికే ఎంగిడిని పెవీలియన్ కు పంపాడు.

దీంతో ఇండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించడంతో పాటు వరల్డ్ టెస్ట్ సిరీస్ లో ఎవరికీ అందనంత ఎత్తున నిలిచింది. స్వదేశంలో ఇండియాకు ఇది వరుసగా 11వ సిరీస్ విజయం కావడం గమనార్హం. సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో డికాక్ 5, ఎల్గర్ 16, హమ్జా 0, డూ ప్లెసిస్ 4, బవుమా 0, క్లాసెన్ 5, లిండే 27, పెడిట్ 23, డీ బ్రూన్ 30, రబాడా 12, ఎంగిడి 0 పరుగులు చేయగా, నార్ట్ జీ 5 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.

భారత బౌలర్లలో షమీకి 3, ఉమేశ్ యాదవ్, నదీమ్ లకు చెరో రెండు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ఒక్కో వికెట్ చొప్పున లభించాయి. భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 497 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News