ఏపీ అభివృద్ధి స్థానిక పార్టీల వల్ల కాదు: బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి

21-10-2019 Mon 17:05
  • రాష్ట్రం అభివృద్ధి బీజేపీ వల్లే సాధ్యం 
  • సీఎం జగన్ చెప్పేదొకటి చేసేది మరోటి
  • ఏపీలో బీజేపీ బలపడాలి

ఏపీ టీడీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ వల్లే సాధ్యం అని, స్థానిక పార్టీల వల్ల కాదని అన్నారు.

 సీఎం జగన్ చెప్పేదొకటి, చేసేది మరోటి అని విమర్శించారు. అందరూ వద్దని చెప్పినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని, అలాగే, రాజధాని అమరావతిపై ఎన్నో అనుమానాలు రేకెత్తించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ వల్లే సాధ్యం అన్నారు. ఏపీలో బీజేపీ బలపడాలని, ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నానని చెప్పారు.