Godavari: గోదావరిలో బోటు వెలికితీతలో పురోగతి.. బోటు పైకప్పును బయటకు తీసిన ధర్మాడి సత్యం బృందం

  • బోటు మునిగిన ప్రాంతానికి వెళ్లిన డైవర్లు
  • బోటు ఏటవాలుగా మునిగినట్టు గుర్తింపు 
  • కాకినాడ పోర్టు అధికారి పర్యవేక్షణలో కొనసాగుతున్న పనులు

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును బయటకు తీయడంతో ధర్మాడి సత్యం బృందం కొంత పురోగతి సాధించింది. ఈ క్రమంలో బోటు పైకప్పును, బయటకు తీశారు. రెండు రోప్ లను బోటుకు కట్టి, మిగతా బోటును బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

ఇక మరి కాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీస్తారని భావిస్తున్నారు. మరోవైపు, గోదావరి నీటిమట్టం 38 నుంచి 40 అడుగుల మేర మాత్రమే ఉండటంతో... బోటును వెలికి తీసుకొచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షణలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.

విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ కు చెందిన డైవర్లు ఈ ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రాంతానికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు బోటు పరిస్థితి ఎలా ఉంది? ఇసుక ఎంత మేర పేరుకుపోయింది తదితర అంశాలను పరిశీలించారు. ఇలా 6 సార్లు నీటి లోపలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు అధికారి మాట్లాడుతూ, బోటు ఏటవాలుగా మునిగి ఉందని చెప్పారు.

More Telugu News