టీడీపీలో మరో వికెట్ డౌన్.. బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డి

21-10-2019 Mon 12:06
  • ఏపీలో టీడీపీకి మరో షాక్
  • జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక 
  • గత కొంత కాలంగా టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆది

ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కడప జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో ఈ ఉదయం ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డిని బీజేపీలోకి జేపీ నడ్డా సాదరంగా ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. గత కొంత కాలంగా బీజేపీలో ఆది చేరబోతున్నారనే ప్రచారం జోరుగానే సాగింది. గతంలో కూడా ఆయన ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆదినారాయణరెడ్డి చేరికతో కడప జిల్లాలో బీజేపీ ఎంత మేరకు పుంజుకుంటుందో వేచి చూడాలి.