lalitha jewellery: లలిత జువెలరీ దోపిడీ కేసు.. చోరీకి ముందు భార్యతో వెళ్లి షోరూమ్‌ను పరిశీలించిన మురుగన్!

  • భార్య నగలు చూస్తుంటే షోరూమ్‌ను పరిశీలించిన మురుగన్
  • దోపిడీ చేసే ప్రదేశానికి కుటుంబంతో కలిసి ముందుగానే మకాం
  • ఓ పోలీసు అధికారికి రూ.30 లక్షల లంచం
తిరుచ్చిలోని లలిత జువెలరీ షోరూమ్‌ దోపిడీ కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.  దోపిడీకి ముందు మురుగన్ తన భార్యతో కలిసి పలుమార్లు షోరూమ్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించాడని పోలీసులు తెలిపారు. భార్య నగలు చూస్తుంటే అతడు మాత్రం అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా గమనించేవాడని పేర్కొన్నారు. సరిగ్గా ఎక్కడ కన్నం వేస్తే.. ఎక్కడకు చేరుకుంటామనేది ఓ అంచనాకు వచ్చి, ఆ తర్వాత పక్కాగా ప్లాన్ చేసి నగలు కాజేసినట్టు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు సురేశ్ విచారణలో ఈ విషయాలను వెల్లడించాడు.

ఈ నెల 14 నుంచి పోలీసుల కస్టడీలో ఉన్న సురేశ్ చెబుతున్న విషయాలు పోలీసులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. దోపిడీ చేయడానికి ముందు మురుగన్ తన కుటుంబంతో కలిసి ఆ ప్రాంతానికి మకాం మారుస్తాడు. ఆ తర్వాత తీరిగ్గా దోపిడీ చేసి మాయమవుతాడు. లలిత జువెలరీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు దోపిడీలకు ముందు కూడా అతడు ఇలానే చేసినట్టు సురేశ్ తెలిపాడు. అంతేకాదు, చెన్నైలోని అన్నానగర్‌లో చోరీ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఓ పోలీసు అధికారికి మురుగన్ రూ. 30 లక్షలు ఇచ్చాడని, తిరువారూర్ పోలీసు అధికారికి  ఖరీదైన కారు కొనిచ్చాడని, ఓ సినీ నటికి బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడని విచారణలో సురేశ్ వెల్లడించాడు.
lalitha jewellery
tiruchi
murugan
Tamil Nadu

More Telugu News