Crime News: భారతీయుడి కోసం అమెరికా ఎఫ్‌బీఐ వేట...పట్టిస్తే రూ.70 లక్షల బహుమతి

  • అతను భార్య హత్య కేసులో నిందితుడు
  • అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్‌కుమార్‌పటేల్‌ ఎన్నారై
  • కొన్నాళ్లుగా అమెరికాలో భార్యతో కలిసి ఉద్యోగం

అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు ఓ భారతీయుడి కోసం వేటాడుతున్నారు. భార్యను హత్యచేసి స్వదేశానికి పరారయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడిని పట్టిస్తే 70 లక్షల రూపాయల బహుమతి కూడా ఇస్తామని సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే...గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్‌కుమార్‌ పటేల్‌ (24), పాలక్‌ (21)లు దంపతులు. వీరిద్దరూ అమెరికాలోని హనోవర్‌ మేరీల్యాండ్‌లోని డంకిన్‌ డోనట్‌ స్టోర్‌లో పనిచేసేవారు. 2015 ఏప్రిల్‌లో పాలక్‌ స్టోర్‌లోని వంట గదిలో మృతదేహంగా కనిపించిది. ఆమె ఒంటిపై తీవ్రగాయాలు కనిపించాయి.

ఈ ఘటన జరిగిన రోజు నుంచి ఆమె భర్త భద్రేశ్‌కుమార్‌ కూడా కనిపించకుండా పోయాడు. ఈ హత్య ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎఫ్‌బీఐ స్టోర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. పాలక్‌ చనిపోవడానికి ముందు దంపతులు ఇద్దరూ స్టోర్‌ వంటగదిలోకి వెళ్లినట్లు అందులో రికార్డయి ఉంది. ఆ తర్వాత భద్రేశ్‌కుమార్‌ ఒక్కడే వంటగది నుంచి బయటకు రావడం కనిపించింది.

స్టోర్‌ నుంచి ఒక్కడే బయటకు వచ్చిన భద్రేశ్‌ కాలినడకన ఇంటికి చేరుకున్నాడు. తన వ్యక్తిగత సామాన్లు తీసుకుని సమీపంలోని విమానాశ్రయానికి వెళ్లి పరారయ్యాడని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. అతను భారత్‌లోనే ఉండి ఉండవచ్చన్న అనుమానంతో ఎఫ్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది.

More Telugu News