Telangana: ప్రాథమికోన్నత పాఠశాలను ఎత్తివేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

  • డ్రాపౌట్లను నివారించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రవేశపెట్టిన అప్పటి ప్రభుత్వాలు
  • ప్రస్తుతం వాటిలో చేరే వారి సంఖ్య తగ్గుతున్న వైనం
  • ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన అనంతరం నిర్ణయం

తెలంగాణలో ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. హైస్కూళ్ల సంఖ్య అధికంగా ఉండడంతో యూపీఎస్ (అప్పర్ ప్రైమరీ స్కూల్)లో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మాత్రమే ఉంచి యూపీఎస్ స్కూళ్ల విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో సగటున 15 మంది విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడు ఉన్నారు. యూపీఎస్ స్కూళ్లను ఎత్తివేయడం ద్వారా అక్కడి ఉపాధ్యాయులను ఈ స్కూళ్లలో సర్దుబాటు చేయవచ్చనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. అంతేకాదు, అవసరమైన చోట్ల యూపీఎస్ స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చాలని కూడా యోచిస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో భాషా పండితులను నియమించాలన్న డిమాండ్ కూడా నెరవేరుతుందని ఉపాధ్యాయ సంఘ నేత ఒకరు తెలిపారు.

హైస్కూళ్లు దూరంగా ఉండడంతో డ్రాపౌట్లు పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో 1996, 2001లో అప్పటి ప్రభుత్వాలు వందల సంఖ్యలో పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశాయి. అయితే, ఆ తర్వాత ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో వీటి అవసరం తగ్గిందని భావించిన ప్రభుత్వం వాటిని ఎత్తివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News