విజయసాయిరెడ్డి గారూ! ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదు: బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్

19-10-2019 Sat 14:35
  • శ్రీభరత్ కుటుంబంపై విజయసాయి ఆరోపణలు
  • ఇప్పుడు మీరు బాధ్యత గల పదవిలో ఉన్నారు
  • అంతే బాధ్యతగా మాట్లాడాలి 

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ఈ వ్యాఖ్యలపై శ్రీభరత్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు.

ట్రాన్స్ కో సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే వాయిదాలు సమయానికి చెల్లించేవాళ్ళం, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయం తమకు స్పష్టంగా తెలిసి కూడా, ప్రజల డబ్బును తాను దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం అని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచివి కావనేది తన అభిప్రాయం అని ఆయన పేర్కొన్నారు.

మన రాష్ట్రంలో చాలా మంది వ్యాపారస్తులు బిల్లులు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు కనుక విజయసాయిరెడ్డి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరూ అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాం. కానీ, అందుకు భిన్నంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను బదులు చెప్పాల్సి వస్తోంది. ప్రజలకు నిజాలు తెలియాలి...’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.