cm: కేసీఆర్ ఇప్పటికైనా దిగిరావాలి: తమ్మినేని వీరభద్రం

  • బంద్ ను అణచివేయాలని చూడటం దారుణం
  • కనివినీ ఎరుగని విధంగా బంద్ సక్సెస్ అవుతోంది
  • అభినవ హిట్లర్ కేసీఆర్ కు పతనం తప్పదు

టీఎస్సార్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ కొనసాగుతోంది. బంద్ కు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద వామపక్ష నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు సూచనను సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా, బంద్ ను ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటం దారుణమని, ఆయన మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

తెలంగాణ చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా బంద్ సక్సెస్ అవుతోందని, ఒకటో, రెండో బస్సులకు పోలీస్ వాహనాలను రక్షణగా పెట్టి బయటకు తీస్తున్నప్పటికీ ప్రయాణికులు ఎవ్వరూ వాటిలో ప్రయాణించడం లేదని అన్నారు. వ్యాపార సంస్థలు, సినిమాహాల్స్, పెట్రోల్ బంక్ లు అన్ని బంద్ అయ్యాయని, ప్రజాజీవనం స్తంభించిపోయిందని అన్నారు. ప్రైవేట్ క్యారియర్స్ సహా ఆటోలు కూడా బంద్ అయ్యాయని, ‘ఇది ప్రజాబంద్’ అన్న విషయాన్ని కేసీఆర్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు.

ఈ బంద్ వెనుక వున్నది కేవలం ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని, యావత్తు తెలంగాణ సమాజం ఉందని, ‘కేసీఆర్ ఇప్పటికైనా దిగొచ్చి చర్చలు జరపాలి’ అని డిమాండ్ చేశారు. సమ్మె విరమించిన తర్వాతనే కార్మికులతో చర్చలు ఉంటాయని ప్రభుత్వం చెప్పడంపై తమ్మినేని స్పందిస్తూ, ‘ఆ మాట తప్పని హైకోర్టు చెప్పింది. అందుకని, బుద్ధి తెచ్చుకుని చర్చలకు పిలవాలి’ అని అన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన వారిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని, ప్రపంచాన్ని శాసించాలని చూసి నాజీ హిట్లర్ పతనమయ్యాడని, ఇవాళ, తాజా హిట్లర్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని శాసించాలని చూస్తున్నారని, పతనం తప్పదని హెచ్చరించారు.

More Telugu News