'ఆదిత్య అరుణాచలం'గా కనిపించనున్న రజనీ

19-10-2019 Sat 11:25
  • ముగింపు దశలో 'దర్బార్' మూవీ 
  • రజనీ కూతురు పాత్రలో నివేద థామస్
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు   

రజనీకాంత్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'దర్బార్' సినిమాపైనే వుంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, అంతా ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రజనీ 'ఆదిత్య అరుణాచలం' అనే పాత్రలో కనిపించనున్నట్టు నివేద థామస్ చేసిన ఒక ట్వీట్ వలన తెలుస్తోంది.

నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రజనీ కూతురు పాత్రలో నివేద థామస్ కనిపించనుంది. 'ఒకే ఒక్కడి గురించి ఈ ప్రపంచం తెలుసుకోవలసిన సమయం  వచ్చింది .. ఆయనే మా నాన్న .. ఆదిత్య అరుణాచలం' అంటూ 'దర్బార్ ' సినిమాలో రజనీ పాత్ర పేరును రివీల్ చేసింది. తను ఆయన కూతురు పాత్రలో చేస్తున్న విషయాన్ని స్పష్టం చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న ఈ సినిమా, ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.