సర్ఫరాజ్ పై వేటు... పాక్ కెప్టెన్ గా అజహర్ అలీ

18-10-2019 Fri 20:15
  • టీ 20 జట్టు కెప్టెన్ గా బాబర్ ఆజమ్
  • ఇటీవలి వైఫల్యాలే  సర్ఫరాజ్ పై వేటుకు కారణం
  • 2019-20 టెస్ట్ చాంపియన్ షిప్ వరకు అలీయే కెప్టెన్

ప్రపంచకప్ తో పాటు, ఇటీవల దేశంలో శ్రీలంకతో ఆడిన టీ 20 సిరీస్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శనకు జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మూల్యం  చెల్లించుకున్నాడు.  సర్ఫరాజ్ ను టెస్ట్, టీ 20  కెప్టెన్సీల నుంచి తప్పిస్తూ పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.  కొత్త కెప్టెన్ గా అజహర్ అలీని ప్రకటించారు. 2019-20 టెస్ట్  చాంపియన్ షిప్ వరకు అతనే కెప్టెన్ గా ఉంటాడు. టీ 20 క్రికెట్ టీంకు బాబర్ ఆజమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 2020 లో జరిగే టీ 20 ప్రపంచకప్ వరకు బాబర్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.

 సర్ఫరాజ్ మంచి ఆటగాడని, సారథ్య బాధ్యతలు చక్కగా నిర్వహించాడని, అతన్ని తొలగించే నిర్ణయం మింగుడు పడనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కెప్టెన్సీ మార్పుకు మొగ్గు చూపామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహసాన్ మణి తెలిపారు. సర్ఫరాజ్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టినప్పుడు జట్టు పరిస్థితి అంతంత మాత్రమేనని, తన హయాంలో జట్టును విజయ పథంలో నడిపినప్పటికీ ఇటీవలి అపజయాలు అతనిపై విమర్శలు వచ్చేలా చేశాయని మణి చెప్పారు. అయితే, సర్ఫరాజ్ ఉద్వాసనకు కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.