Ganjayi: ఏపీ నుంచి భారీగా గంజాయి అక్రమ రవాణా.. రెండు రోజుల్లో 670 కేజీలు స్వాధీనం

  • కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద మినీ బస్సులో 240 కేజీలు
  • గుర్తించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు
  • నిన్న విశాఖ జిల్లాలో 430 కేజీలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అక్రమ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని వరుసగా జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. నిన్న విశాఖ రూరల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో 430 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకోగా, ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద మరో 240 కేజీల గంజాయి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి చిక్కడం గమనార్హం. ఒక్క రోజు వ్యవధిలో ఈ ఘటనలు జరగడంతో విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమార్కులు తరలిస్తున్న గంజాయిలో కొంత మొత్తం ఇది అయి ఉంటుందని భావిస్తున్నారు.

 వివరాల్లోకి వెళితే... ఓ మినీ బస్సులో విశాఖ నుంచి కర్ణాటకకు గంజాయి తరలుతోందన్న సమాచారం అందడంతో పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టారు. బస్సు రాగానే తనిఖీలు నిర్వహించగా గంజాయి లభించడంతో దాన్ని స్వాధీనం చేసుకుని పది మంది నిందితులను అరెస్టు చేశారు.

నిన్న విశాఖ జిల్లా నర్సీపట్నం-చింతపల్లి రోడ్డులో నెలిమెట్ల కూడలి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా డీజిల్‌ ట్యాంకు మాదిరిగా ఏర్పాటు చేసిన బాక్స్‌లో ప్యాకెట్ల రూపంలో ఉంచి తరలిస్తున్న వంద కేజీల గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వెనుకే వస్తున్న కారులో నుంచి మరో 60 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి కారు, వ్యాన్‌ని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, విశాఖ జిల్లా పాయకరావుపేటలోని నర్సీపట్నం జంక్షన్‌లో స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న ఆరు బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 175 కేజీల బరువున్న దీని విలువ రూ.2 లక్షలు ఉంటుందని అంచనా.

అలాగే, హుకుంపేట మండలం దిగుడుపుట్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనంలో తరలిస్తున్న 102 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఘటనల్లోనూ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల వ్యక్తులు కూడా అరెస్టు కావడంతో ఈ వ్యవహారం అంతా పెద్ద ముఠా ఆధ్వర్యంలోనే నడుస్తోందని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News