East Godavari District: బోటు వెలికితీత యత్నం ఫలిస్తుందా?...నేటి నుంచి మళ్లీ పనులు

  • రంగంలోకి దిగుతున్న ధర్మాడి సత్యం బృందం
  • గతంలో రెండు సార్లు చేసిన ప్రయత్నం విఫలం
  • వరద పెరగడంతో పనులకు తాత్కాలిక బ్రేక్‌
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిన ప్రయాణికుల బోటు ‘రాయల వశిష్ట’ వెలికితీత సాధ్యమేనా? ఈసారైనా ప్రయత్నం ఫలిస్తుందా? కనీసం శవాలు కూడా దొరకక చివరి చూపైనా దక్కలేదన్న ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతున్న బాధితుల కుటుంబానికి ఊరట లభిస్తుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఈరోజు నుంచి మరోసారి బోటు వెలికితీత ప్రయత్నాలు మొదలు పెడుతోంది.

సెప్టెంబరు 15వ తేదీన ఈ బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గల్లంతైన వారిలో ఇంకా 15 మంది జాడ తెలియలేదు. వీరి మృతదేహాలు బోటులోనే చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానంతో బోటును బయటకు తీయాలన్న డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో 25 మంది సభ్యులున్న సత్యం బృందానికి వెలికితీత బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఆ ప్రయత్నాలలో సదరు బృందం రెండుసార్లు విఫలమైంది.  

తాజాగా ఈరోజు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈసారి రెండు భారీ లంగర్లు, 3 వేల అడుగుల రోప్‌ని వినియోగించనున్నారు. వెలికితీత పనుల ప్రగతిపై కచ్చులూరు నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్‌ ఫోన్‌, వైర్‌లెస్‌ సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
East Godavari District
kachuluru
boat accident
dharmadi satyam

More Telugu News