Harish Shankar: దేవిశ్రీ ప్రసాద్ విషయంలో నాదే పొరబాటు: హరీశ్ శంకర్

  • ఓ పాట రీమిక్స్ చేయాలని కోరిన హరీశ్
  • చేయలేనని చెప్పి గద్దలకొండ గణేశ్ నుంచి వైదొలగిన దేవిశ్రీ
  • ఇద్దరి మధ్య విభేదాలంటూ ప్రచారం
ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గద్దలకొండ గణేశ్' చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమాకు మొదట దేవిశ్రీ ప్రసాద్ ను సంగీతదర్శకుడిగా తీసుకున్నా, ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. దేవిశ్రీ, హరీశ్ శంకర్ మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ వివరణ ఇచ్చారు.

దేవిశ్రీ ప్రసాద్ తనకు మంచి స్నేహితుడని, గద్దలకొండ గణేశ్ చిత్రంలో ఇతర పాటలతో పాటు ఓ రీమిక్స్ పాట చేయమని కోరామని వెల్లడించారు. కానీ రీమిక్స్ పాటలు చేయబోనని దేవిశ్రీ గతంలోనే చెప్పాడని, ఇప్పుడు తాము కోరినా అదే విషయం చెప్పి సినిమా నుంచి సున్నితంగా వైదొలిగాడని వివరించారు. ఈ విషయంలో తనదే పొరబాటు అని హరీశ్ శంకర్ అంగీకరించారు. దేవిశ్రీ రీమిక్స్ లు చేయడని తెలిసినా కూడా ఒప్పించవచ్చులే అన్న నమ్మకంతోనే అడిగానని వివరణ ఇచ్చారు.

కాగా, హరీశ్ శంకర్ ఇచ్చిన క్లారిటీ దేవిశ్రీ ప్రసాద్ ను సంతోషపెట్టింది. ట్విట్టర్ లో స్పందిస్తూ, మీ నిజాయతీకి హ్యాట్సాఫ్, మీ మాటలతో మీపై నాకున్న ప్రేమ మరింత పెరిగింది అంటూ వ్యాఖ్యానించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డేపై చిత్రీకరించిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ' పాట రీమిక్స్ కు ప్రేక్షకులను నుంచి విశేష స్పందన రావడం తెలిసిందే.
Harish Shankar
Devisri Prasad
Tollywood

More Telugu News