ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి.. ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారు?: హైకోర్టు
- హైకోర్టులో వాదనలు వినిపించిన ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్లు
- విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు
- తదుపరి విచారణ 18కి వాయిదా
వాదనల సందర్భంగా ఆర్టీసీ కార్మికుల తరపు న్యాయవాది వాదిస్తూ, చాలా కాలంగా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ కూడా లేరని చెప్పారు. కార్మికులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని, ఆఖరి అస్త్రంగానే సమ్మెకు దిగామని తెలిపారు. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ, ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినా ఫలితం రాలేదని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో, ప్రత్యామ్యాయ ఏర్పాట్లను చేసినప్పుడు విద్యా సంస్థలకు సెలవులను ఎందుకు పొడిగించారని కోర్టు ప్రశ్నించింది. సమ్మెపై రెండు రోజుల్లో ప్రభుత్వం పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 18కి హైకోర్టు వాయిదా వేసింది.