Guntur District: పల్నాడులో వైసీపీ దాడులపై దర్యాప్తు జరపనున్న ఎన్ హెచ్ ఆర్సీ

  • ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • వారి ఫిర్యాదుకు సానుకూల స్పందన
  • పల్నాడులో పర్యటించనున్న ఎన్ హెచ్ ఆర్సీ బృందం

గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ దాడులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) దర్యాప్తు జరపనుంది. సాధ్యమైనంత త్వరలో ఎన్ హెచ్ ఆర్సీ బృందం పల్నాడులో పర్యటించనుంది. పల్నాడులో వైసీపీ బాధితులతో కలిసి టీడీపీ ప్రజాప్రతినిధుల బృందం ఢిల్లీలో ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ దత్తును కలిసింది. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ ఓ నివేదికను అందజేసింది. ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ ని కలిసిన వారిలో ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

వాస్తవాలు తెలుసుకుని మంచి నివేదిక ఇవ్వాలి: రామ్మోహన్ నాయుడు

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పల్నాడులో వైసీపీ దాడులపై  ఎన్ హెచ్ ఆర్సీ దర్యాప్తునకు ఆదేశించడంపై దత్తుకు తమ కృతఙ్ఞతలు తెలియజేశామని చెప్పారు. పల్నాడులో పర్యటించనున్న ఎన్ హెచ్ఆర్సీ బృందం వాస్తవాలు తెలుసుకుని ఒక మంచి నివేదిక ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వం తమ వ్యవహారశైలిని మార్చుకునే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

నివేదిక అందాక చర్యలు చేపడతామని చెప్పారు: కనకమేడల

కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, కొంత మంది పోలీస్ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, బాధితులకు రక్షణ కల్పించకుండా వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్న విషయాన్ని దత్తు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఎన్ హెచ్ ఆర్సీ సొంత టీమ్ ను పంపించి దర్యాప్తు చేస్తామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని చెప్పారని అన్నారు. తమ ఫిర్యాదుపై ఆయన సానుకూలంగా స్పందించారని, దర్యాప్తునకు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు.

More Telugu News