Amit Shah: ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించదు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ

  • మోదీ నేతృత్వంలోని భారత్ ఉగ్రవాదం అంతు చూస్తుంది
  • మానేసర్ లో అట్టహాసంగా ఎన్ ఎస్ జీ 35 రైజింగ్ డే ఉత్సవాలు
  • ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై నమూనా ప్రదర్శనలతో  ఆకట్టుకున్న కమెండోలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ ఉగ్రవాదంను ఉక్కుపాదంతో అణచివేస్తుందని.. ఉగ్రవాదంను  ఏమాత్రం సహించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దీనిపై భారత్ వైఖరి స్పష్టంగా ఉందని  ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

హర్యానాలోని మానేసర్ లో జాతీయ భద్రతా దళాల( ఎన్ ఎస్ జీ)  35వ స్థాపక దినోత్సవంలో పాల్గొన్న షా ప్రసంగిస్తూ.. దేశ పురోభవృద్ధికి ఉగ్రవాదులు, దాని సానుభూతిపరులు ఆటంకాలుగా మారారన్నారు. ‘భారత్  ఎన్ ఎస్ జీ పరిరక్షణలో భద్రంగా ఉంది. మనం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ (సహనరహితంగా) అన్న విధానంతో ముందుకు సాగుతున్నాము. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ప్రేరేపిత, ఆర్థిక సహాయం పొందుతున్న.. ఉగ్రవాద సంస్థలతో భారత్ పోరాడుతోంది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దుతో ఆ రాష్ట్రంలో శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ   జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తీసిపారేసే లక్ష్యంతో ఈ అధికరణను రద్దు చేశారు’ అని చెప్పారు.

ఈ సందర్భంగా బ్లాక్ క్యాట్ కమెండోలు ఉగ్రవాదుల దాడులను నిర్వీర్యం చేసే ప్రక్రియను ప్రదర్శించారు. విదేశాలకు చెందిన భద్రతా కమెండోలకు ఏమాత్రం తీసిపోని ఎన్ ఎస్ జీ కమెండో బలగాలు దేశంలో ఎక్కడైనా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఇది యూకేకు చెందిన ఎస్ఏఎస్, జర్మనీకి చెందిన జీఎస్ జీ-9 బలగాలతో సమానమైన సామర్థ్యాలను కలిగివుంది. ఎన్ ఎస్ జీ రెండు విభాగాలుగా  ఉంటుంది. స్పెషల్ యాక్షన్ గ్రూప్( ఎస్ ఏజీ) మొదటిది కాగా,  సైనిక సిబ్బంది, స్పెషల్ రేంజర్ గ్రూప్స్ లతో కూడిన ఎస్ ఆర్ జీ రెండోది.  ఇందులో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు కూడా చేరి ఉంటాయి.

More Telugu News