tsrtc: దసరా సెలవులను పొడిగించడమే ఆర్టీసీ కార్మికులకు తొలి విజయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

  • సమ్మె కారణంగా ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించింది
  • కార్మికులు చేస్తున్న సమ్మెపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది
  • కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు

రాష్ట్రంలో సమ్మె కారణంగా ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించడమే ఆర్టీసీ కార్మికుల తొలి విజయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. పలు జిల్లాల్లో డిపోల ముందు కార్మికులు చేస్తున్న ఆందోళనలకు రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలుపుతున్నారు. సూర్యాపేట డిపోముందు బైఠాయించిన కార్మికులకు లక్ష్మణ్ మద్దతు తెలిపి మీడియాతో మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని లక్ష్మణ్ కోరారు. కొన్ని రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సమ్మెపై కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన చెప్పారు. గతంలో ఉద్యమాలతో ప్రజలను ఒకే తాటిపైకి తెచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నారని విమర్శించారు.

More Telugu News