Jagan: సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతి లభించింది... జగన్ తో భేటీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి!

  • నిన్న జగన్ తో చిరంజీవి భేటీ
  • 'సైరా' కారణంగానే ప్రమాణ స్వీకారానికి రాలేకపోయా
  • సినీ పరిశ్రమకు జగన్ సహకరిస్తానన్నారు
'సైరా' చిత్రం షూటింగ్ లో తాను బిజీగా ఉన్న కారణంగానే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి రాలేకపోయానని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. నిన్న జగన్ తో తన భేటీపై ఆయన మాట్లాడుతూ, జగన్ సీఎం కాగానే, ఆయన్ను కలిసి అభినందించాలని భావించానని చెప్పారు.

 రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారని చెప్పారు. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని, పరిశ్రమకు ఏది కావాలన్నా సంకోచించకుండా తనను అడగాలని కూడా జగన్ కోరినట్టు చిరంజీవి తెలిపారు. జగన్ సహాయ గుణాన్ని చూసి తనకు చాలా సంతోషమేసిందని, సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతిని సొంతం చేసుకున్నానని అన్నారు.

తాను 'సైరా' చిత్రం చూడాలని జగన్ ను ఆహ్వానిద్దామని భావించానని, కానీ ఆయన మాత్రం, సతీ సమేతంగా తన ఇంటికి వచ్చి, మధ్యాహ్నం తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరారని, ఇది తనకు లభించిన ఓ గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. భారతిలో తాను సోదర ప్రేమను చూశానని అన్నారు. ఇక త్వరలోనే 'సైరా' చిత్రాన్ని తిలకిస్తానని జగన్ చెప్పారని చిరంజీవి అన్నారు.

ఇక గత ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించినప్పటికీ, రెండేళ్లుగా వాటిని ఇవ్వలేదని తాను ప్రస్తావించగా, వెంటనే భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహించి, అవార్డులను అందించేలా చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారని అన్నారు. కొందరు సినీ పరిశ్రమ పెద్దలు మీ దగ్గరికి రావాలని భావిస్తున్నారని తాను చెబితే, "ఎనీ టైమ్ అన్నా... కచ్చితంగా అందరినీ కలుస్తాను. సమయం తీసుకుని ఏర్పాటు చేయండి" అని జగన్ అన్నారని చెప్పారు.
Jagan
Chiranjeevi
Meeting

More Telugu News