Narendra Modi: ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విదేశాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది: ప్రధాని మోదీ

  • ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్న ప్రధాని
  • మేనిఫెస్టోలో ఆర్టికల్ 370 పెట్టే దమ్ముందా? అంటూ వ్యాఖ్యలు  
  • రాహుల్ పైనా విమర్శలు
హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్టికల్ 370 రద్దు ఓ విప్లవాత్మక నిర్ణయం అని, అయితే దానిపై కాంగ్రెస్ ఇంతవరకు తన వైఖరిని వెల్లడించలేదని అన్నారు. కశ్మీర్ పై కాంగ్రెస్ పార్టీవి మొసలి కన్నీళ్లని వ్యాఖ్యానించారు. హర్యానాలోని బల్లాభ్ గఢ్ లో ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ను చీల్చి చెండాడారు.

"మీరు అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370 తీసుకురాగలరా? మీకా దమ్ముందా? కనీసం మేనిఫెస్టోలో అయినా ఆర్టికల్ 370 అంశాన్ని పెట్టగలరా?" అంటూ సవాల్ విసిరారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విదేశాల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోందని మోదీ ఈ సందర్భంగా ఆరోపించారు.

అంతేకాకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాద్ధాంతం చేశారని, ఎంతో ఉపయుక్తమైన ఆ ఒప్పందాన్ని రద్దు చేయడానికి సర్వశక్తులూ ఒడ్డారని వ్యాఖ్యానించారు. కానీ, ఇలాంటి వాళ్ల ప్రయత్నాలన్నీ వీగిపోయాయని, తొలి రాఫెల్ విజయవంతంగా మన చేతికి అందిందని మోదీ పేర్కొన్నారు.
Narendra Modi
Congress
Rahul Gandhi
Haryana

More Telugu News